తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ ఆరోరాతో గురువారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో జరిగిన ఎన్నికల నిర్వాహణపై శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈసీని ముఖ్యమంత్రి కోరారు. ఈ గుర్తులు ఒకే రకంగా ఉండటంతో వయో అధికులు కాస్త కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారని సీఎం వివరించారు.
దీంతో కొన్ని చోట్ల తెరాసకు రావాల్సిన ఓట్ల కంటే కూడా ఆ గుర్తులున్న వారికి ఎక్కవగా వచ్చాయని తెలిపారు. వీటితో పాటు తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల తెరాసకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రెంట్ దిశగా దేశంలోని పలు రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులను కలిసేందుకు కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.