మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఎఫ్-15 ఫైటర్‌జెట్‌లను ఇరాన్ సరిహద్దుల్లో మోహరించినట్లు యూఎస్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్ దూకుడు చర్యలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.‘నేడు అమెరికా ఎయిర్‌ఫోర్స్ 492వ ఫైటింగ్ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగల్స్‌ను మిడిల్ ఈస్ట్‌కు తరలించాం.ఇప్పటికే అవి సెంట్రల్ కమాండ్‌కు చేరుకున్నాయి’ అని యూఎస్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఇప్పటికే అమెరికా బీ-52 బాంబర్లు కూడా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలకు చేరాయి. వీటికి అండగా ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డెస్ట్రాయర్స్‌ను తరలించింది. అంతకుముందే థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది. ‘ఇరాన్, దాని ముసుగు దళాలు అమెరికా మిలటరీ, దాని ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అడ్డుకుని, మా వారిని కాపాడుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటాం’ అని వాషింగ్టన్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.