తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) ముఖ్య నేతల సమావేశాన్ని ఈ నెల 6న నిర్వహించనున్నారు. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శనివారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్వీ నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా సమన్వయకర్తలు, నియోజకవర్గ అధ్యక్షులు, కీలక సభ్యులు హాజరుకానున్నారు. ప్రధానంగా విద్యార్థుల సమస్యలను తీర్చేందుకు తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, సామాజిక మాధ్యమంలో పార్టీ ప్రచారాన్ని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు.