ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఆమోదం

-

ట్రిపుల్ తలాక్ ని క్రిమినల్‌ నేరంగా పేర్కొంటున్న ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. అయితే స్వల్ప మార్పులను  సవరించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులో చేర్చింది. ప్రతిపాదిత చట్టం నాన్‌ బెయిలబుల్‌గా ఉన్నప్పటికీ.. విచారణ ప్రారంభానికి ముందు బెయిల్‌ పొందే వెసులుబాటుని ఇందులో కల్పించారు.నిందితుడు మేజిస్ట్రేట్‌ను కలిసి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బెయిల్ పై అంతిమ నిర్ణయం కోర్టు పరిధిలోని అంశం. అక్కడికక్కడ అప్పటికప్పుడు మూడుసార్లు తలాక్‌ చెప్పడం చట్ట విరుద్ధమని, మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించాలని ముస్లిం మహిళల హక్కుల రక్షణ బిల్లు పేర్కొంటోంది.

ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ… తలాక్‌ కేసులో జైలుకి వెళ్లిన భర్త బెయిలుపై బయటకు రావాలంటే బాధితురాలు ఆయనతో రాజీ చేసుకుని న్యాయమూర్తిని కోరాల్సి ఉంటుంది. ఆమె ఒప్పుకుంటేనే భర్త బెయిలు పొందుతాడు. బాధితురాలికి పిల్లలు మైనర్లయితే, ఆమెతో పాటు పిల్లల పోషణకు భర్త ఎంత డబ్బు ఇవ్వాలన్న విషయాన్ని న్యాయమూర్తి నిర్ణయిస్తారు’ అని రవి శంకర్‌ ప్రసాద్‌ వివరించారు. ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ పై తీసుకున్న నిర్ణయానికి ముస్లీం మహిళలలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version