తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధి పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. తిరుమల కొండ ప్రాంతంలో ఎటువంటి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగరేయకూడదనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. గతంలోనే శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అయినప్పటికీ సోమవారం ఉదయం తిరుమల గగనమార్గంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
దీంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధం అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే దానిపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నో ఫ్లై జోన్‌గా ఉన్నా తిరుమల కొండపై హెలికాప్టర్ వెళ్లడంపై ఏవీయేషన్ అధికారులకు సమాచారం అందించారు. ఆగమశాస్త్రాన్ని ఉల్లంఘించడంపైనా అధికారులతో చర్చిస్తున్నారు. నో ఫ్లై జోన్‌లోకి అసలు హెలికాప్టర్ ఎలా వెళ్లిందని అధికారులను సమాచారం కోరినట్లు తెలుస్తోంది.