బీఆర్‌ఎస్ మాత్రమే పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించ గలదని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ , బీజేపీ కంటే ఎక్కువసార్లు తెలంగాణ గురించి రాజ్యసభ,లోక్‌సభల్లో ప్రశ్నించామని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అమలుకు సాధ్యంకాని హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుదని చెప్పారు.
రైతుబంధు రూ.15వేలు వేస్తామని,పెన్షన్ తీసుకోవద్దని డిసెంబర్ తర్వాత రూ.4000 వేలు ఇస్తామని, ప్రతిఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు గుర్తుచేస్తే ఉలిక్కి పడుతున్నారని నామా అన్నారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు ప్రజా పాలన దరఖాస్తుల పేరుతో కాలయాపన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు,పార్లమెంట్ షెడ్యూల్‌లోపే అమలు చేయకపోతే ప్రజలు నిలదీయాలని, జాప్యంపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్‌సభ నుంచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరిని లోక్‌సభ బరిలో నిలిపినా కలిసి పనిచేస్తామని నామా నాగేశ్వరరావు తెలిపారు.