నేటి నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

-

ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి..

వినాయక నిమజ్జన ఊరేగింపులు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయక దర్శనానికి వచ్చేవారితో పాటు, ట్యాంక్ బండ్ పై సందర్శకుల రద్దీ పెరగనున్నకారణంగా శనివారం నుంచి ఈ నెల 22 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు  ట్యాంక్ బండ్ చుట్టుపక్కల వాహనాల రాకపోకలపై ఆంక్షలు, కొన్ని చోట్ల మళ్లింపులు ఉంటాయని తెలిపారు.

ఖైరతాబాద్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గంలోకి అనుమతించరు. ఇందిరాగాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) నుంచి నెక్లెస్ రోడ్ వైపు, ఐమాక్స్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు మళ్లిస్తారు.

ఎన్టీఆర్ మార్గ్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. అక్కడి నుంచి తెలుగు తల్లి విగ్రహం జంక్షన్ మీదుగా కట్టమైసమ్మ ఆలయం నుంచి డీబీఆర్ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళ్లాలని సూచించారు.

కర్బలా మైదాన్ నుంచి వచ్చేవాహనాలను ట్యాంక్ బండ్ వైపుకు అనుమతించరు. హోటల్ మారియట్ టి. జంక్షన్ కు మళ్లిస్తారు. లిబర్టీ వైపు వెళ్లాల్సిన వాహనాలు కవాడిగూడ సర్కిల్ మీదుగా గాంధీ నగర్ టీ.జంక్షన్ ..డీబీఆర్ రోడ్డు మీదుగా ఇందిరాపార్కు..నుంచి లిబర్టీకి చేరుకోవాలి. గోశాల నుంచి వచ్చే వాహనాలను డీబీఆర్ వైపు.. ట్యాంక్ బండ్ పైకి వాహనాలను రానివ్వరు..డీబీఆర్ మార్గంలో లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా మళ్లిస్తారు.ఇలా నగరంలో ట్రాఫిక్ రద్దీ సమయంలో  ప్రయాణాలను, ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్ లకు వెళ్లే వారు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version