నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

-

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. దీంతో బుధవారం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.  ఈ రోజు  రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవానికి చేస్తారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలు, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ క్రతువును నిర్వహించడం నాటి నుంచి  వస్తున్న ఆనవాయితీ. అంకురార్పణ ఘట్టానికి  ముందు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనులవారిని తీరుమాడ వీధుల్లో ఊరేగుతారు.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ , బీజవాపనం అత్యంత ముఖ్యమైంది. ముందుగా పాలికల్లో (మట్టికుండలు) పుట్టమన్ను నింపి, అందులో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలను నింపుతారు. పాలికల చుట్టూ అష్టదిక్పాలకులతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు. నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచి చివరిరోజున ఈ మొలకలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. బ్రహోత్సవాల సందర్భంగా తితిదే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే నేపథ్యంలో వీఐపీ దర్శనాన్ని రోజుకు ఓ సారి మాత్రమే నిర్ణీత సమయంలో అనుమతిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news