మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి (ఆర్ఆర్)లో సోమవారం ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఏర్పడ్డ క్లాట్స్ ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ పూర్తయినా ప్రణబ్ పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ సపోర్టును అందిస్తున్నామని ఆసుపత్రి తాజాగా మెడికల్ బులిటెన్ విడుదల చేసింది. బ్రెయిన్ సర్జరీకి ముందు నిర్వహించిన టెస్టుల్లో పణబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయింది. ఆయన ఆగస్ట్ 10న రాత్రి 12.07 నిమిషాలకు ఆర్ఆర్ ఆసుపత్రిలో చేరారు.
మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ట్వీట్ చేయగా.. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ప్రజలను కోరారు.ముఖర్జీ కరోనా బారిన పడటంపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్లప్పుడు చురుగ్గా ఉండే ముఖర్జీకి త్వరగా స్వస్థత చేకూరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ముఖర్జీ కోలుకుంటారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం ముఖర్జీ కోలుకోవాలని ట్వీట్ చేశారు.ప్రణబ్ ముఖర్జీ త్వరగా కరోనా నుంచి బయటపడతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు ప్రణబ్ కోలుకోవాలని ట్వీట్లు చేశారు.