న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిమిత్తం ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. సెప్టెంబరు 10న సీజేఐ ప్రతిపాదించే ధర్మాసనంలో కేసు విచారణ చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ కోరారు. ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన చట్టపరమైన ప్రశ్నలను రాజ్యాంగ ధర్మాసనంలోనే విచారించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ సరైన అభ్యర్థన లేకుండా రూపొందించిన ఇలాంటి ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, సుమోటోగా తీసుకునే ధిక్కరణ అధికారాల మధ్య సందిగ్ధతపై సుదీర్ఘ విచారణ అవసరమని జస్టిస్ అరుణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. తాను త్వరలోనే రిటైర్ కాబోతున్నందున మరో ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
సుప్రీం న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ఇటీవల తేల్చింది. దీనిపై క్షమాపణ చెప్పాలని, తన ప్రకటనపై పునరాలోచన చేయాలని ప్రశాంత్ భూషణ్‌కు ఈనెల 24 వరకు గడువు ఇచ్చింది. తాను క్షమాపణ చెప్పేదిలేదని, సుప్రీం తీర్పుకే కట్టుబడి ఉంటానని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. తాజాగా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మరో ధర్మాసనానికి కేసు బదిలీ చేసింది.