దావోస్ పర్యటన అనంతరం నేరుగా లండన్ కి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై అనుచితంగా మాట్లాడిన తీరుపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు సంస్కారహీనంగా మాట్లాడడాన్ని ఆయన ఖండించారు.బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భిక్షవల్లే రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు అని,నీ బతుకేంటో మీ పార్టీ నేతలు కోమటిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు.
ఏది పడితే అది మాట్లాడటం ఆపి ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసేటట్లు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ పాత్ర సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వీధి రౌడీని తలపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసిన కేసీఆర్‌ని తూలనాడడం సరి కాదన్నారు. నీకు దమ్ముంటే కేఆర్‌ఎంబీకి వ్యతిరేకంగా కొట్లాడాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.