ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన మేడారంలో స్థానిక గిరిజన సమాజానికి రక్షకులుగా భావించే సమ్మక్క మరియు సారలమ్మ దేవతల గౌరవార్థం ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే ఈసారి వచ్చేనెల ఫిబ్రవరిలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరగబోతుంది.మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా.ఎ.శరత్ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,డైరెక్టర్ ఇ. వెంకట్ నర్సింహారెడ్డి తో కలిసి మేడారంలో చేపడుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా వన దేవతలను దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తులు ఇప్పటి నుంచే వస్తున్నందున పారిశుధ్యం తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసిన ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు.ఫ్లడ్ లైట్లు, తాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీపడవద్దని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మహా జాతరను విజయవంతం చేయాలనీ కోరారు.