ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని ,ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు,కే.కేశవరావు,మధుసూదనాచారి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కసరత్తుల గురించి చర్చించుకున్నామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా కేవలం 1.8 మాత్రమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల కు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వంద రోజుల్లో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రుణమాఫీ,రైతుబంధు చేస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. ఎన్నికలలో కెసిఆర్ ప్రభుత్వం ఓడిపోవడంతో ప్రజలు నిరాశ కి గురి అయ్యారని ఆయన అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదని ఆయన అన్నారు.