ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి వేస్తున్న క్రమంలో ఈ రెండు రోజుల్లో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు, తారకరామానగర్, భూపేష్ గుప్తానగర్ ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియంలో వరద బాధితుల కోసం కార్పోరేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక భూపేష్ గుప్తా నగర్ లో ప్రజలు ఇళ్ళను ఖాళీ చేయాలంటూ మైకుల ద్వారా తహశీల్దార్ లలితాంజలి, ఇతర రెవిన్యూ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.
తహశీల్దార్ లలితాంజలి మాట్లాడుతూ పులిచింతల నుంచి ఈరోజు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తుందని అంచనా వేస్తున్నామని కలెక్టర్ ఆదేశాలతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. గతంలో వరద వచ్చాక బయటకు రావడంతో చాలా మంది సామాన్లు వదిలేసి నష్టపోయారని, ఇప్పుడు ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నామని ఆన్నారు. పునరావాస కేంద్రాలలో వరద బాధితులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈనెల 24వ తేదీ వరకు వరద ప్రభావం అధికంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలకు రాలేని వారు, కోవిడ్ భయం ఉన్నవారు తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళవచ్చని ఆమె పేర్కొన్నారు.