చంద్రబాబు ఎత్తులు ఇక్కడ చెల్లవు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పార్టీలు ప్రజలను ఆకర్షించే మేనిఫెస్టోలను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పటికీ సీట్ల సర్దుబాటు జరగని మహాకూటమి సైతం మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తెరాస మేనిఫెస్టో గురించి మంత్రి కేటీఆర్ మీడియాతో స్పందిస్తూ.. విజయదశమి తర్వాత రైతులకు, తెలంగాణ ప్రజలకు మేలు చేకూరేలా మేనిఫెస్టోని విడుదల చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెదేపా ఎంపీ సీఎం రమేష్, ఏపీలో ఇతర ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఓటుకు నోటు ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నించి అడ్డంగా పట్టుపడ్డారు… ఇప్పుడు మరో 500 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావండ కోసం తన అనుచరులను పార్టీలోకి పంపించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటెలిజెన్స్‌ను తెలంగాణకు తీసుకొచ్చారని గుర్తు చేశారు.