ప్రముఖ టీవీ నటిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని ఓ హత్య కేసులో విచారణ చేపట్టారు. కిడ్నాప్‌నకు గురైన ఓ వజ్రాల వ్యాపారి హత్య కేసులో టీవీ నటి దేవలీన భట్టాఛర్జీ ప్రమేయంపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం రాజేశ్వర్ ఎడాని అనే వజ్రాల వ్యాపారి శవమై కనిపించాడు.
ఘాట్కోపర్‌కు చెందిన రాజేశ్వర్ నవంబర్ 28 నుంచి కనిపించకుంపోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, పది రోజుల అనంతరం వ్యాపారి మృతదేహం కుళ్లిన స్థితిలో రాయ్‌గఢ్‌లోని పన్వేల్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. వ్యాపారీ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు కాల్ డేటాను పరిశీలించారు. సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలను ఈ వ్యాపారి తరచుగా కలిసేవాడని దర్యాప్తులో తేలింది. ఈ కేసుతో సంబంధమున్న దినేశ్ పవార్ అనే సస్పెండెడ్ పోలీసు కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో టీవీ నటి దేవలీనాను కూడా పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో ఇంకా సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు మహిళలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.