జమ్ముకశ్మీర్లో కొద్దిరోజులుగా భారత బలగాలు, ఉగ్రవాదుల మధ్య తరుచూ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత బలగాలు ఆ దిశగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో పలువురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా.. జమ్ముకశ్మీర్ బట్మలూలో సీఆర్పీఎఫ్, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక టెర్రరిస్టు మృతి చెందాడు. అలాగే సీఆర్పీఎఫ్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేగాకుండా.. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మృతి చెందాడు.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తరుచూ కాల్పులు జరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. కాగా, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులు అడుగుపెట్టకుండా ఉండేలా వ్యూహం అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే టెర్రరిస్టుల ఏరివేతను ముమ్మరం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.