ఐపీఎల్‌లో ప్రస్తుతం 8 జట్లే ఉన్నా.. త్వరలోనే ఆ సంఖ్య 10కి చేరనుందని తెలుస్తోంది. భవిష్యత్తులో నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీలలో 10 జట్లు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ప్రతి ఏటా వేసవిలో భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీని క్రికెట్ ప్రేమికులు ఇంతగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ ద్వారానే అనేకమంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ఆయా దేశాల అంతర్జాతీయ జట్లకు వారు ఆడుతున్నారు. అయితే ఐపీఎల్‌లో ప్రస్తుతం 8 జట్లే ఉన్నా.. త్వరలోనే ఆ సంఖ్య 10కి చేరనుందని తెలుస్తోంది. భవిష్యత్తులో నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీలలో 10 జట్లు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఐపీఎల్‌లో 10 జట్లను ఆడించడంపై ఇప్పటికే లండన్ లో ఆయా ఫ్రాంచైజీలు సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించినట్లు తెలిసింది. కాగా 2011లో పూణే వారియర్స్, కేరళ టస్కర్స్ పేరిట రెండు జట్లు ఐపీఎల్ లోకి ప్రవేశించినా.. ఆ తర్వాత వాటిని కొనసాగించలేదు. బీసీసీఐతో చేసుకున్న ఒప్పందంలో పలు ఇబ్బందులు రావడంతో ఆ రెండు జట్లు కేవలం రెండు సీజన్లలో మాత్రమే పాల్గొన్నాయి. దీంతో 2014 నుంచి ఐపీఎల్ లో 8 జట్లు మాత్రమే పోటీ పడుతూ వస్తున్నాయి. అయితే ఐపీఎల్‌కు లభిస్తున్న ప్రేక్షకాదరణ కారణంగా మరో రెండు జట్లు టోర్నీలో ఉంటే బాగుంటుందనే ఆలోచనకు వచ్చిన ఫ్రాంచైజీలు లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అయితే ఐపీఎల్ లో ఎన్ని జట్లు ఉండాలనే విషయంపై బీసీసీఐ తీసుకునేదే అంతిమ నిర్ణయం కనుక ఫ్రాంచైజీలు 10 జట్లకు ఉత్సాహం చూపినప్పటికీ బీసీసీఐ ఆమోదముద్ర వేస్తేనే టోర్నీలో 10 జట్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఐపీఎల్ లో పాల్గొంటే మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరగడంతోపాటు షెడ్యూల్ కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. అలాగే భారీ ఎత్తున మ్యాచ్‌లకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీంతో నిర్వహణ కొంచెం కష్టతరమవుతుందని బీసీసీఐ ఆలోచిస్తోందట. అయితే అన్ని ఇబ్బందులను దాటుతామనుకుంటే కచ్చితంగా 10 జట్లను బీసీసీఐ ఐపీఎల్‌లో ఆడిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పదు..!