రాజుల పాలనలో తప్పు చేసిన వారికి శిక్షలు విచిత్రంగా విధించేవారు. వారికి నగర బహిష్కరణ, లేదా గ్రామ బహిష్కరణ, కొన్నేళ్ల పాటు గ్రామంలో అడుగుపెట్టొదంటూ తీర్మానించేవారు. కాలం మారింది. నిందితులను శిక్షించే విధానం కూడా మారింది. కానీ తాజాగా ఓ దేశంలో నగర బహిష్కరణ కేసు ఒకటి వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ల బాలుడిని అక్కడి కోర్టు నగర బహిష్కరణ తీర్పు విధించింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరూ..? అతడిని ఎందుకు నగర బహిష్కరణ విధించారో తెలుసుకుందామా?.
ఆ బాలుడి పేరు కిల్యాన్ ఎవాన్స్ (14 ఏళ్లు). యూకేలోని కిడ్డెర్ మిన్‌స్టర్‌లోని వోర్సెస్టర్‌షైర్ పట్టణంలో నివసిస్తుంటాడు. అతడి ప్రవర్తనతో పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చంపేస్తానని బెదిరించడంతో.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని.. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత కూడా కిల్యాన్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
వ్యాపారులు, స్థానికులను భయపెడుతూ మరింతగా రెచ్చిపోయాడు. అక్రమ వసూళ్లకు కూడా పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు మొహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం కోర్టు కిల్యాన్‌పై ‘క్రిమినల్ బిహేవియర్ ఆర్డర్’ సెక్షన్ అమలు చేసింది. 2025 మే నెల వరకు అతడు పట్టణంలో కనిపించకూడదని తీర్పును ఇచ్చింది.