కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. వారికి 15 రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్ (ఎస్సీఎల్)ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు చెందిన తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కోవిడ్ బారిన పడితే వారికి 15 రోజుల పాటు ఆ సెలవు ఇస్తారు. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అయితే కోవిడ్ బారిన పడిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులను హాస్పిటల్లో చేర్పిస్తే వారు 15 రోజుల తరువాత కూడా కోలుకోకపోతే వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యే వరకు లీవ్‌ను పొడిగించడం జరుగుతుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే స్వయంగా కోవిడ్ బారిన పడితే 20 రోజుల పాటు ఆ సెలవును అందిస్తామని తెలిపింది. వారు ఐసోలేషన్‌లో ఉన్నా లేదా హాస్పిటల్ లో చికిత్స పొందినా ఆ లీవ్ వర్తిస్తుందని తెలియజేసింది. అయితే 20 రోజుల పాటు చికిత్స తీసుకున్నా కోవిడ్ తగ్గకపోతే వారికి ఆపై కూడా లీవ్‌ను మంజూరు చేస్తారు. కానీ వారు సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి చెందిన కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ సోకితే వారు ఇంట్లోనే 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఈ విధానం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.