టిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ లో వచ్చేనెల 15న ఏర్పాటు చేస్తున్న తెలంగాణ విజయ గర్జన సభకు టిఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ కోసం జనాలను తరలించేందుకు ఏకంగా పదహారు వేల బస్సులను సిద్ధం చేస్తున్నట్టు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. విజయ గర్జన ప్లీనరీ సన్నాహాల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…విజయ గర్జన సభకు 16 వేల బస్సులు నడుపుతామని అందులో ఆరు వేల ఆర్టీసీ బస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ నెల 25న హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే టిఆర్ఎస్ పార్టీ సమావేశానికి ప్రతినిధులు అంతా గులాబీ చొక్కా… మహిళలు అంతా గులాబీ చీరలు ధరించి రావాలని సూచించారు. ఇక ఈ సమీక్ష సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు హాజరయ్యారు.