రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు IMD బ్యాడ్ న్యూస్ అందజేసింది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ మూడు నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, బెంగాల్ తీరాల మీదుగా సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడుతుందని పేర్కొన్నారు. అటు సెప్టెంబర్ రెండో వారంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్ష సూచన అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిమట్టమయ్యాయి. ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవించింది.