పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అమానుషమని.. హేయమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా శాసనసభలో సీఎం కేసీఆర్ పైవిధంగా స్పందించారు. పుల్వామా ఉగ్రదాడిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇది జవాన్లపై జరిగిన దాడి కాదు… మన జవాన్లపై జరిగిన దాడిగా వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. దీంతో అమరులైన కుటుంబాలకు అండగా ఉండటం కోసం.. వాళ్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం… అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ తీర్మానాన్ని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీనికి సభ వెంటనే ఆమోదం తెలిపింది. అనంతరం సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అమరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం గొప్ప పని అని ప్రతిపక్ష సభ్యులు కొనియాడారు.