మూడు వారాలు క్వారెంటెన్ లో ఉండండి, మీ ఆరోగ్యం తో పాటు పక్క వారి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరించండి అని తప్పని పరిస్తితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే మనకు మూడు రోజులు ఇంటిపట్టున ఉండటం కష్టం అవుతుంది మనందరికీ. కానీ పాపం మేరీ ఏకంగా 26 యేళ్లు క్వారంటెన్ లోనే ఉండి జీవితం ముగించింది. ఇది జరిగి చాలా యేళ్లు అయింది. 1868లో నార్త్ ఐర్లాండ్‌లో జన్మించిన మేరీ మాలన్ 1884లో అమెరికాకు వలస వచ్చింది. మేరీ మాలన్, ఈమె ఇళ్ళలో వంటమనిషి గా పని చేసేది..
1900.. 1907 మధ్యకాలంలో న్యూయార్క్‌లో ఏడుగురి ఇళ్లలో వంటమనిషిగా పనిచేసింది. 1901లో మమరొనెక్ ప్రాంతంలో ఓ ఇంట్లో మేరీ పనికి కుదిరిన రెండు వారాల తర్వాత ఆ ఇంట్లో వాళ్లు టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డారు. దీంతో మేరీ అక్కడ మానేసి మాన్‌హట్టన్‌లోని ఒకరి ఇంట్లో వంట పనికి కుదిరింది. ఆ ఇంటి యాజమాని సహా కుటుంబసభ్యులంతా కొద్ది రోజుల్లోనే టైఫాయిడ్, డయేరియాతో బాధపడ్డారు. ఆ ఇంటి చాకలి అయితే ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో మేరీ అక్కడ కూడా పని మానేసింది.
మళ్లీ 1906లో ఒయిస్టర్ బే ప్రాంతంతంలోని నలుగురు ఇళ్లలో వంట పనికి కుదిరింది, అక్కడవాళ్లు కూడా టైఫాయిడ్ బారిన పడ్డారు. అక్కడ నుండి కూడా వచ్చేసి మేరీ చివరగా న్యూయార్క్‌లో ఉండే ఛార్లెస్ హెన్రీ వారెన్ అనే బ్యాంక్ అధికారి ఇంట్లో వంట మనిషిగా చేరింది. కొన్నాళ్లకు హెన్రీ కూడా ఒయిస్టర్ బేకి మారడంతో మేరీ కూడా వాళ్లతోపాటు వెళ్లింది. అక్కడికి వచ్చిన రెండు వారాలకే హెన్రీ కుటుంబంలో 10 మందికి జ్వరం రావడం, ఒక్క ఒయిస్టర్ బేలోనే తక్కువ సమయంలో పలు కుటుంబాలు టైఫాయిడ్ బారిన పడటం ఆ ప్రాంతంలో అలజడి మొదలయ్యింది.
మేరీ మాత్రం ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉండటం విచిత్రం. అయితే మేరీ పనిచేసిన కుటుంబం తమకు టైఫాయిడ్ ఎలా వచ్చింది అని జార్జి సొపర్ అనే పరిశోధకుడిని నియమించారు. అతడు మేరీ వల్లనే టైఫాయిడ్ వస్తుందని అనుమానించాడు. అంతే కాకుండా తన అనుమానాన్ని బలపర్చేలా స్థానికంగా మరికొన్ని టైఫాయిడ్ కేసులు ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో అతను వారి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో పని చేసే ఇద్దరు పనివాళ్లకు టైఫాయిడ్ రావడంతో ఇంటి యాజమాని కూతురు టైఫాయిడ్ తో మరణించింది. అదే ఇంట్లో పని చేస్తున్న మేరీని కలిసిన సోపర్..
వైద్య పరీక్షలకు సహకరించాలని అడగగా, మేరీ ఒప్పుకోలేదు. వారికి జ్వరం రావడానికి తను ఎలా కారణం అని నిలదీసింది. దీంతో సోపర్ బలమైన సాక్ష్యాల కోసం మేరీ అంతకు ముందు పని చేసిన ఇళ్లకు వెళ్లాడు. అందరిని విచారించి టైఫాయిడ్ రావడానికి మేరీ నే కారణమని నిర్ధారించుకున్నాడు. వైద్యుడిని తీసుకుని మేరీ దగ్గరికి వెళ్లాడు. అప్పుడు కూడా ఆమె వైద్య పరీక్షలకు చేయించుకోడానికి ఒప్పుకోలేదు. న్యూయార్క్‌లో టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో విచారణ జరిపిన న్యూయార్క్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా మేరీనే కారణమని గుర్తించారు.
దీంతో 1907లో పలు సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసి క్వారంటైన్ విధించారు. ఆమెను బలవంతంగా నార్త్ బ్రదర్ ఐలాండ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించగా టైఫాయిడ్‌కు కారణమైన సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా మేరీ పిత్తాశయంలో ఆవాసం ఏర్పాటు చేసుకుందని తేలింది. కాబట్టి మేరీ ద్వారానే ఇతరులకు బాక్టీరియా సోకుతుందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ విషయాన్ని మేరీ ఒప్పుకోలేదు. వ్యాధి తన వల్ల వ్యాప్తి చెందట్లేదని వాదించింది. వైద్యులు మేరీకి ఆమె ద్వారా ఈ వ్యాది ఎలా వచ్చింది అనేది వివరించారు.
జ్వరం సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. బాక్టీరియా కలిసిన ఆహారం, నీరు ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తోంది. అయితే ఈ బాక్టీరియా సోకిన వ్యక్తులు వాడిన వస్తువులు వాడటం, వారు చేసిన ఆహారం తినడం ద్వారా ఇది వ్యాపించే అవకాశాలున్నాయి. మేరీ వంటపని చేస్తుండటంతో ఆమె ద్వారా బాక్టీరియా ఆహారంలో కలవడం, ఆమె వాడిన వస్తువులు వాడటంతో ఇతరులకు ఈ బాక్టీరియా సోకి టైఫాయిడ్, డయేరియా రావడానికి కారణం అని వైద్యులు ఆమెకు వివరించారు. వైద్యులు ఆమెను ప్రస్తుతం ఆమె చేస్తున్న వృత్తిని మానేయమని చెప్పినా మేరీ ఒప్పుకోలేదు.
దీంతో మేరీని బలవంతంగా మూడేళ్లు క్వారంటైన్‌లో ఉంచారు. అప్పటి హెల్త్ కమిషనర్ ఎక్కువ రోజులు క్వారంటైన్‌లో ఉంచడం మంచిది కాదని భావించి, మళ్లీ వంటపని చేయనని, టైఫాయిడ్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానంటే వదిలేస్తామని మేరీనీ ఒప్పించారు. ఆమె ఒప్పుకోవడంతో ఫిబ్రవరి 19, 1910లో మేరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి న్యూయార్క్‌కు వెళ్ళింది. అయితే క్వారంటైన్ నుంచి విడుదలైన మేరీ వంటపనిలో కాకుండా చాకలి పని చేసేందుకు కుదిరింది. ఐదేళ్లపాటు చాకలి పని చేసింది.
కానీ చాకలి పని లో వంటపనికన్నా తక్కువ జీతం కావడం వల్ల మేరీ మళ్లీ వంటపని నే ఎంచుకుంది. కొన్ని ఇళ్లలో వంట పని చేయగా అక్కడి వారందరికి టైఫాయిడ్ వచ్చింది. 1915లో మేరీ వల్ల చాలా మంది టైఫాయిడ్ బారిన పడ్డారు. తర్వాత న్యూయార్క్‌లోని ఓ మహిళా ఆస్పత్రిలో మేరీ పని చేయగా అక్కడ 25 మంది మహిళలకు టైఫాయిడ్ రాగా, అందులో ఇద్దరు మృతి చెందారు. మేరీ వల్లనే ఇదంతా అని గుర్తించిన పోలీసులు మార్చి 27, 1915న ఆమెను అరెస్టు చేసి నార్త్ బ్రదర్ ఐలాండ్‌లోని ఆస్పత్రిలో క్వారంటైన్‌కు తరలించారు.
అయితే ఐలాండ్‌లో ఆస్పత్రిలో కొంతకాలం క్వారంటైన్‌లో ఖాళీగా ఉన్న మేరీకి అదే ఆస్పత్రిలోని ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా అధికారులు పని కల్పించారు. అక్కడే పని చేస్తూ ఆమె కాలం గడిపింది.1932లో పక్షవాతం రావడంతో మేరీ పూర్తిగా మంచం పట్టింది. ఆరేళ్లు తర్వాత నవంబర్ 11, 1938న మేరీ న్యూమోనియాతో బాధపడుతూ మరణించింది. బ్రాంక్స్‌లోని సెయింట్ రేమాండ్స్ స్మశానంలో ప్రభుత్వ అధికారులే ఆమె అంత్యక్రియలు పూర్తి చేసి సమాధి నిర్మించారు. మేరీ మాలన్‌పై ‘‘టైఫాయిడ్ మేరీ’’ పేరుతో చాలా పుస్తకాలు వచ్చాయి.1993లో మేరీ కథతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. తనకున్న అనారోగ్యం కారణంగా మేరీ మాలన్ కాస్త టైఫాయిడ్ మేరీ అయ్యింది.