సల్మాన్‌ఖాన్‌కు చెందిన గుర్రాన్ని అమ్ముతున్నామని చెప్పిన ముగ్గురు వ్యక్తులు ఓ మహిళకు రూ.12 లక్షల మేర కుచ్చు టోపీ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సంతోష్ భాటి అనే మహిళకు గతేడాది ఆగస్టులో ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. కాగా వారు సల్మాన్‌ఖాన్‌కు చెందిన ఫాంలోని గుర్రాన్ని ఆయన అమ్మకానికి పెట్టాడని ఆ మహిళను నమ్మించారు.
ఆ గుర్రాన్ని సల్మాన్ అమ్మేస్తున్నాడని, దాన్ని కొనుక్కుని మళ్లీ ఎవరికైనా అమ్ముకుంటే రూ.లక్షలు సంపాదించవచ్చని వారు నమ్మబలికారు. అందులో భాగంగానే వారు ఆమెకు కొన్ని ఫొటోలను కూడా చూపించారు. అయితే అదంతా నిజమే అని నమ్మిన ఆ మహిళ వారికి రూ.11 లక్షల నగదు పేమెంట్ చేసింది. మరో రూ.1 లక్షకు చెక్ ఇచ్చింది. అయితే అప్పటి నుంచి వారు ఆమెకు గుర్రాన్ని డెలివరీ చేయలేదు.
దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆ మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను పట్టుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.