థాయిలాండ్‌లోని ఓ ప్రీస్కూల్ వద్ద గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 32 మంది మరణించినట్లు ఆ దేశ వార్తాపత్రికలు పేర్కొన్నాయి. మృతుల్లో అత్యధికంగా చిన్నారులే ఉన్నట్లు తెలిపాయి. ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాలంఫూ ప్రావిన్స్‌లో జరిగింది. కాల్పులు చేసిన దుండగుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడు పాన్య ఖమ్రాప్( 34)గా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు మాజీ పోలీసు అధికారి అని.. అతడిని ఏడాది కిందటే విధుల నుంచి తొలగించారని తెలిపారు. అప్పట్లో అతడు మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో విధుల నుంచి తొలగించారని చెప్పారు. ఈ కేసులో శుక్రవారం రోజు కోర్టు విచారణకు హాజరుకావాల్సిన నేపథ్యంలో ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పులకు పాల్పడిన అనంతరం అతడు బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న 4డోర్ వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయాడు.