నిజామాబాద్ లో చిన్నారి కిడ్నాప్..10గంటలైనా దొరకని ఆచూకీ..!

నిజామాబాద్ లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న మూడేళ్ల చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో చిన్నారి హాసిని ని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. చిన్నారి కిడ్నాప్ పై తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలింపులు చేపడుతున్నారు. ఇక ఇప్పటి వరకు చిన్నారిని కిడ్నాప్ చేసి పది గంటలు అవుతుంది.

అయినప్పటికీ పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు 20 బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలిస్తున్నారు. నవీపేట లో కిడ్నాపర్లు సంచరించినట్టు పోలీసులకు సమాచారం అందింది. పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.