మొదట జీపీఆర్ఎస్, తరువాత ఎడ్జ్.. ఆ తరువాత 2జీ.. తరువాత 3జి, 4జి.. వచ్చాయి. ప్రస్తుతం మనం 4జిని వాడుతున్నాం. అయితే ఇకపై 5జి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు రిలయన్స్ జియోలు ఈ రేసులో ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఎయిర్ టెల్ 5జి సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది.
నిజానికి ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికే 5జి సేవలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మొబైల్ తయారీ కంపెనీలు కూడా 5జి ఫీచర్ ఉన్న స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే మన దేశంలో 5జి ఇంకా రాలేదు. అయినప్పటికీ మన దగ్గర కూడా 5జి ఫోన్లను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో 5జి స్పెక్ట్రం కొనుగోలుకు వేలం నిర్వహించాలని కేంద్రం భావించింది. కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే మన దేశంలో 5జి వచ్చేందుకు కొంత ఆలస్యం అవుతుంది.
అయినప్పటికీ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లకు 5జి స్పెక్ట్రంతో పనిలేదు. ఎందుకంటే 5జి టెక్నాలజీని సపోర్ట్ చేసే హార్డ్‌వేర్‌ను ఇప్పటికే ఆయా కంపెనీలు కలిగి ఉన్నాయి. కేవలం సాఫ్ట్‌వేర్ రూపొందిస్తే చాలు, 5జి సేవలను అందించవచ్చు. అయితే ఇందుకు అయినా ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. కానీ దీనికి అనుమతులు త్వరలోనే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పటికే ఉన్న 4జి నెట్‌వర్క్ మీదే 5జి సేవలను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియోతోపాటు ఎయిర్‌టెల్ కూడా 5జి సేవలను 4జి నెట్‌వర్క్ మీద పరీక్షిస్తున్నాయి. అవి సక్సెస్ కూడా అయ్యాయి. దీంతో కేంద్రం అనుమతితో ఈ రెండు కంపెనీలు త్వరలోనే 5జి సేవలను దేశంలో ప్రారంభిస్తాయని తెలుస్తోంది.