కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు రోజుకు 1.50 లక్షల కేసులు వచ్చేవి. ఇప్పుడు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోందని చెప్పవచ్చు. అయితే దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో చాలా వరకు వాటిలో కోవిడ్ డబుల్ మ్యుటెంట్ కేసులే అధికంగా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి డబుల్ మ్యుటంట్ కేసులే కారణమని చెప్పలేమని, కానీ ఆ కేసులు చాలా వరకు నమోదవుతున్నాయని అన్నారు. మొత్తం కేసుల్లో వాటి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఎక్కువగా కోవిడ్ డబుల్ మ్యుటంట్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.
మహారాష్ట్రతోపాటు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గుజరాత్, పలు ఇతర ప్రాంతాల్లోనూ కోవిడ్ డబుల్ మ్యుటంట్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. పరీక్షించిన 60 శాతం నమూనాల్లో కోవిడ్ డబుల్ మ్యుటేషన్ వేరియంట్ ఉనికి ఉందని అన్నారు. అలాగే యూకే కోవిడ్ స్ట్రెయిన్ కేసుల ప్రభావం మన దేశంలో పెద్దగా లేదని అన్నారు.
మన దేశంలో 80 జిల్లాల్లో యూకే వేరియెంట్‌కు చెందిన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లలో యూకే వేరియెంట్ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో యూకే స్ట్రెయిన్‌తోపాటు డబుల్ మ్యుటంట్ కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అయితే కోవిడ్ మరణాలకు డబుల్ మ్యుటంట్ కారణం అవుతుందా, లేదా అనేది ఇంకా నిర్దారించలేదని, దీనిపై అధ్యయనాలు చేస్తున్నామని తెలిపారు.