భారత్‌లో 7శాతం మంది దగ్గర క్రిప్టోకరెన్సీ : ఐరాస

-

భారత్‌లో 2021 నాటికి దాదాపు ఏడు శాతం మంది దగ్గర డిజిటల్‌ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌-19 సమయంలో క్రిప్టోకరెన్సీ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. జనాభాపరంగా అత్యధిక మంది క్రిప్టోకరెన్సీలు కలిగిన తొలి 20 దేశాల జాబితాలో 15 అభివృద్ధి చెందుతున్న దేశాలేనని ‘యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ’ పేర్కొంది.

ఈ జాబితాలో ఉక్రెయిన్‌ తొలిస్థానంలో నిలిచింది. ఆ దేశ జనాభాలో దాదాపు 12.7 శాతం మంది వద్ద క్రిప్టోకరెన్సీ ఉందని నివేదిక తెలిపింది. రష్యా (11.9 శాతం), వెనిజువెలా (10.3 శాతం), సింగపూర్‌ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), అమెరికా (8.3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచిన భారత్‌లో దాదాపు 7.3 శాతం మంది క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నారని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది.

ఈ ప్రైవేటు డిజిటల్‌ కరెన్సీల వల్ల కొందరు భారీగా లాభపడ్డట్లు ఐరాస నివేదిక తెలిపింది. అదే సమయంలో నగదు బదిలీ సాధనంగా కూడా ఉపయోగపడ్డట్లు పేర్కొంది. అలాగే ద్రవ్యోల్బణ ముప్పును అధిగమించే స్థాయిలో రాబడినిస్తుందని మదుపర్లు భావించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రిప్టోకరెన్సీలకు ఆదరణ లభించినట్లు వివరించింది.

కానీ, ఈ అస్థిర ఆర్థిక సాధనం వల్ల సామాజిక, ఆర్థిక దుష్ప్రభవాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఒకవేళ క్రిప్టోను చెల్లింపుల మాధ్యమం కింద విస్తృతంగా వినియోగిస్తే.. అది దేశాల ఆర్థిక సౌరభౌమత్వానికే ప్రమాదమని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా మారతాయని పేర్కొంది. ఒకవేళ వీటి నియంత్రణకు కేంద్ర బ్యాంకులు గనక నేరుగా రంగంలోకి దిగితే.. పరిస్థితి మరింత జటిలమై ప్రజాసమస్యగా మారుతుందని హెచ్చరించింది.

క్రిప్టోలు నగదు బదిలీకి అనువుగా ఉన్నప్పటికీ.. దీనివల్ల పన్ను ఎగవేత వంటి సమస్యలు తలెత్తుతాయని ఐరాస తెలిపింది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయ మార్గాలు కుచించుకుపోయి ప్రమాదం తలెత్తక తప్పదని పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీల విస్తరణను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. దీనికోసం క్రిప్టో కరెన్సీలు, ఎక్స్ఛేంజీలు, డిజిటల్‌ వ్యాలెట్ల నియంత్రణకు సమగ్ర చట్టాలను రూపొందించాలని కోరింది. అలాగే చట్టబద్ధ సంస్థలు క్రిప్టోకరెన్సీల కొనుగోలు నుంచి దూరంగా ఉంచాలని హితవు పలికింది. ఈ డిజిటల్‌ కరెన్సీలకు సంబంధించిన ప్రకటనలను కూడా నియంత్రించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version