ఒక వ్యూహం.. ఒక విజన్.. ఏ నాయకుడినైనా ముందుకు నడిపిస్తుంది. ఇక, ప్రజాసమస్యలను నిరంతరం పట్టించుకోవడంతో పాటు.. వారికి అన్ని విధాలా అండగా ఉంటే ప్రజల్లో ఉండే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి మాటలే గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా కొన్నాళ్ల కిందట బాధ్యతలు చేపట్టిన ప్రముఖ సమాజ సేవకుడు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అనేక రూపాల్లో ఆర్ధిక, వస్తు సేవలు అందించిన వేగేశ్న నరేంద్ర వర్మ. వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆయన ఇక్కడ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి పదవులు లేకపోయినా టీడీపీని పటిష్టం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు.
కీలకమైన నీటి ఎద్దడిని తగ్గించేందుకు సొంతంగా ట్యాంకులు ఏర్పాటు చేయడంతోపాటు.. విద్యార్థులకు పేదలకు అనేక రూపాల్లో సాయం చేశారు. ఇక, ఎన్నికలకు ముందు ప్రతి గ్రామానికీ పాదయాత్రగా వెళ్లి చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా తప్పిపో యింది. ఇక, ఇక్కడ నుంచి పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ ఓడిపోవడం.. బీజేపీలో చేరిపోవడంతో తర్వాత చంద్రబాబు, లోకేష్ వర్మతోనే ఇక్కడ పార్టీ గెలుపు సాధ్యమవుతుందని భావించి ఆయనకే నియోజకవర్గ పగ్గాలు ఇచ్చారు.
పార్టీలో అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా నే కాకుండా పార్టీకి కూడా అనుకూలంగా మార్చడంలో వేగేశ్న వంద శాతం కృత కృత్యులయ్యారని గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వేగేశ్న ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో తిరుగులేని విధంగా దూసుకుపోతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఉండడంతో ఏడెనిమిది నెలల్లోనే బాపట్లలో టీడీపీ గ్రాఫ్ తిరుగులేకుండా పుంజుకుంది. మరోవైపు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను కూడా టార్గెట్ చేస్తున్నారు.
ఇసుక అక్రమాలపై పోరాటంతో పాటు టిక్కో ఇళ్లను ఇవ్వాలనే పిలుపుతో నియోజకవర్గంలో ఆందోళనలను కూడా చేస్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకు పార్టీ ఇచ్చే పిలుపులో భాగంగా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం బాపట్ల నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఇక్కడ అధికార పార్టీ నేతగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉన్నా వర్మ దూకుడును తట్టుకోడం ఆయనకు కష్టసాధ్యంగా మారింది. ఏదేమైనా బాపట్లలో సంవత్సరాల తర్వాత పార్టీని నిలబెట్టే నేత వర్మ రూపంలో టీడీపీకి లభిచారనే చెప్పాలి. మరి ఇక్కడ ఆయన పార్టీ జెండా ఎగరేస్తారో ? లేదో ? చూడాలి.