ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఈ కొత్త విధానాలను రూపోందించాం అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయి. 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాకాలు ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మలచాలన్నది మా లక్ష్యం.
అలాగే ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ రూపకల్పన చేస్తున్నాం. కేంద్రప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసుకుని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తాం. ఇలా ఓ 10 వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా ప్రతీ ఉత్పత్తికీ ఓ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. క్వాలిటీ, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. పండించే పంటలకు విలువజోడిస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుంది. విలువ జోడిస్తే ప్రపంచానికే ఫ్రూట్ బాస్కెట్ గా ఏపీ అవతరిస్తుంది అని చంద్రబబు పేర్కొన్నారు.