రాజధాని అమరావతిని మారుస్తున్నారనే వివాదం రాజుకుంది దాదాపు 250 రోజులు అయింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మరోపక్క, ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపుతోంది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంచుతామని చెబుతోంది. అయితే, దీనిపై న్యాయపరమైన వివాదాలు తలెత్తి.. తరలింపుపై స్టే ఇచ్చినా.. పనులు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో రాజధాని జిల్లాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.. ప్రజలు తీవ్రఆగ్రహంతో ఉన్నారు. రాజధాని వచ్చింది కాబట్టి.. తమ భూములకు విలువ పెరిగిందని చాలా మంది భావించారు.
అదేసమయంలో చేతి వృత్తుల వారు కూడా తమ వ్యాపారాలు పుంజుకుంటున్నాయని భావించారు. చిరు వ్యాపారులు కూడా మురిసిపోయారు. అయితే ఇప్పుడు రాజధాని తరలింపుతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు ఈ ఎఫెక్ట్ అధికార పార్టీలో ఎమ్మెల్యేలపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు. అంటే.. వ్యక్తిగతంగా వారిపై ప్రజలకు కోపంలేకున్నా.. మొండిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్‌పై ఈ రెండు జిల్లాల్లోని కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి వారంతా.. జగన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు. రేపు ఎన్నికల్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా నే ఓట్లేస్తారు.
ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో జగన్ బలంతో గెలుపు గుర్రం ఎక్కిన ఎమ్మెల్యేలకు ఈ ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉందని అంటున్నారు. అంటే.. తమ సొంత బలంతో నెగ్గిన ఎమ్మెల్యేలపై ఈ ప్రభావం అంతగా కనిపించకపోయినా.. కేవలం జగన్ చేసిన పాదయాత్రతో గెలిచిన నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్, గుంటూరులో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ, తాడికొండలో డాక్టర్ శ్రీదేవి, పెదకూరపాడులో నంబూరు శంకర్రావు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వంటి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
వీరి గెలుపు నిజంగానే జగన్‌ను బట్టి వచ్చిందేనని వారు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని వ్యతిరేకత ఇప్పుడు వైసీపీపై తీవ్రంగా ఉండడంతో ఈ రెండు జిల్లాల్లో కొత్త ఎమ్మెల్యేలకు, రాజకీయ అనుభవం లేని ఎమ్మెల్యేలకు కష్టాలు మామూలుగా లేవు.