వంట నూనె ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో వంటనూనె ధరలు ఆమాంతం పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్‌కు రూ.15 నుంచి 20 పెరిగాయి. పిండి పంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్టంగా రూ.170కి చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.
కరోనా తర్వాత కొంత కాలం పాటు వంటనూనె ధరలు అగ్గిరాజేశాయి. ఓవైపు సంపాదన లేకుండా మరోవైపు పెరిగిన ధరలతో ఎలా బతకాలని సామాన్యులు అల్లాడిపోయారు. దాదాపు రెండేళ్ల తర్వాత వంటనూనెల ధరలను కేంద్రం తగ్గించడంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఉన్నట్టుండి మరోసారి వంటనూనెల ధరలు పెరగడంతో పండుగల టైంలో సామాన్యులకు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.