తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన పాపికొండల పర్వతశ్రేణి అందాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. చాలామంది యాత్రికులు పాపికొండల విహారానికి వెళ్తుంటారు. గోదావరి పై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం అందరిని కట్టిపడేస్తాయి. రుతుపవనాల విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో తుఫాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు గోదావరి నదిలో నీటి ఉధృతి పెరగడంతో పాపికొండలు విహార యాత్రకు బ్రేక్ పడింది. తాజాగా వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా యాత్రకు వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 4 రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.