స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ల అమలుపై ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి వీలుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం డాక్టర్ జె.కృష్ణమూర్తి కేసులో వెలువరించిన ఆదేశాలను పాటించి రాష్ట్రంలో కూడా ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టులో జరిగిన వాదనల అనంతరం జస్టిస్ ఎస్.నంద ఏకసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఎస్.నంద ఏకసభ్య ధర్మాసనం ముందు సీనియర్ అడ్వకేట్, మాజీ అడ్వకేట్ జనరల్ బీ.ఎస్.ప్రసాద్ పిటిషనర్ పక్షాన వాదనలను వినిపించారు. జస్టిస్ ఎస్.నంద, ఏకసభ్య ధర్మాసనం పిటిషనర్ ఆర్ కృష్ణయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలను సమర్థించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ల శాతంను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించింది.