కరోనా వైరస్ సోకకుండా దోహదపడే కోవిడ్ ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’లో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొవిడ్-19 రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా *ఓపెన్ ఏపీఐ సర్వీస్*ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు ఉంటుంది.
అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది. అలాగే.. ఇందులో కేవలం ఆరోగ్య సేతు స్టేటస్, యూజర్ పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఆరోగ్య సేతు యాప్‌నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉండడం గమనార్హం.