నారాయణపేట జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు.మంత్రి కేటీఆర్ పర్యటనలో అకస్మాత్తుగా ఆయన కాన్వాయ్‌ని ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్ మీదకు దూసుకురావడంతో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కేటీఆర్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
అనంతరం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన చేసారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… భారతదేశం లో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు భీమా కార్యక్రమం చేపట్టామని… చేనేత కార్మికులకు కూడా భీమా పథకం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
నేతన్న కు చేయూత కార్యక్రమం తో 96 కోట్ల రూపాయల సహాయం చేసామని పేర్కొన్న కేటీఆర్… నేతన్న లు తమ వృత్తిని తాము నమ్ముకొని ముందుకు పోయే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. 50 శాతం సబ్సిడీ తో నూలు రసాయనాలు అందిస్తున్నామని.. నేతన్న సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.