ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ వ్యవస్థాపక సీఈవో ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. తమ కంపెనీ అభివృద్ధి చేసిన ఓ మెడిసిన్‌తో కరోనా పేషెంట్లకు వ్యాధిని నయం చేశామని తెలిపారు. వారికి ఇచ్చిన ఆ ఔషధం వల్ల ఒక్కో వ్యక్తిని బట్టి కరోనా 5 నుంచి 14 రోజుల్లో పూర్తిగా నయమైందని తెలిపారు. సదరు ఔషధంపై చేపట్టిన క్లినికల్ స్టడీ 100 శాతం అనుకూలమైన ఫలితాలను ఇచ్చిందని అన్నారు.
కోవిడ్ 19 వ్యాప్తి మొదలయ్యాక మేం ఓ సైంటిస్టు బృందాన్ని ఏర్పాటు చేశాం. వారు ముందుగా కరోనాపై పోరాడే పలు ఆయుర్వేద సమ్మేళనాలను గుర్తించారు. వాటితో వందలమంది కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందించాం. ఆ అధ్యయనాల్లో 100 శాతం అనుకూలమైన ఫలితాలు వచ్చాయి.. అని బాలకృష్ణ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం పతంజలి ఆయుర్వేద సంస్థ మరిన్ని క్లినికల్ ట్రయల్స్‌ను చేపట్టిందని, మరో వారం రోజుల్లో తాము ఈ విషయాలను రుజువు చేసే సాక్ష్యాలు, ఆధారాలను బయట పెడతామని తెలిపారు.
మా కంపెనీ ఔషధం తీసుకున్నాక కోవిడ్ 19 పేషెంట్లు 5 నుంచి 14 రోజుల్లోగా పూర్తిగా కోలుకున్నారు. వారందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. కనుక, ఆయుర్వేదం కరోనాను నయం చేస్తుందని మేం చెప్పగలం. ప్రస్తుతం నియంత్రిత పద్ధతిలో అధ్యయనాలు చేస్తున్నాం. మరో 4, 5 రోజుల్లో మా వద్ద ఉన్న సాక్ష్యాలను, ఇతర సమాచారాన్ని బయటి ప్రపంచానికి విడుదల చేస్తాం.. అని బాలకృష్ణ తెలిపారు.
అయితే సదరు అధ్యయనాలను పతంజలి ఆయుర్వేద సంస్థ ఎక్కడ చేస్తున్నదీ.. ఆయన వివరాలను వెల్లడించలేదు. కాగా ఏప్రిల్ చివరి వారంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా పేషెంట్లలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గాను అవసరమైన ఆయుర్వేద, హోమియో ఔషధాల తయారీకి రూ.2.48 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పతంజలి సంస్థ చేసిన ప్రకటన మనకు ఓ ఆశాకిరణంలా కనిపిస్తుంది. ఆ ఆయుర్వేద ఔషధమే గనక కరోనాను నయం చేయగలిగితే నిజంగా మనం ప్రపంచంలోనే ఓ అద్భుతమైన ఘనత సాధించినట్లు లెక్క.