మా తప్పేం లేదు.. అంతా జగన్ ప్రతీకారమే! అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు.. విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన రెండు జిల్లాల్లో ఇద్దరు నాయకులను జగన్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని బాబు జీర్ణించుకోలేక పోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే.. వాళ్ల తప్పేంలేదు .. ఏదైనా ఉంటే.. జగన్‌దే అని.. పార్టీ మారలేదనే కక్షతోనే వారిపై ఇలా అరెస్టుల కొరడా ఝళిపిస్తున్నారని చంద్రబాబు పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నారు. అయితే, తాజాగా ప్రభుత్వం ప్రభాకర్‌రెడ్డి సహా ఆయనకు మారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేయడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు.
అయితే, అంత ఈజీగా వారిని ప్రభుత్వం అరెస్టు చేయలేదు. చాలా తీవ్రమైన పరిశీలన, పరిశోధన చేసిన తర్వాతే.. వారిని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం తరఫున పేర్ని నాని పూస గుచ్చినట్టు ప్రభాకర్ రెడ్డి తప్పుల చిట్టాలను వెల్లడించారు. అదేసమయంలో చంద్రబాబుకు కూడా పేర్ని గట్టి సవాలే రువ్వారు. దమ్ముంటే.. రండి.. చర్చించుకుందాం! అంటూ సవాల్ రువ్వారు. దీంతో ఈ విష యం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు హయాంలోనే అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ప్రభాకర్ రెడ్డి కుటుంబం దాదాపు 66 స్క్రాప్ కింద లారీ ఛాసిస్‌లను అత్యంత కారు చౌకకు కొనుగోలు చేసింది.
వీటిని బీఎస్-3 కింద పేర్కొంటూ.. అశోక్ లేలాండ్ అమ్మేసింది. అంటే.. వీటిని సాధారణ వినియోగంలోకి తీసుకురాకూడదు. కానీ, తమ అధికారాన్ని వినియోగించిన ప్రభాకర్‌రెడ్డి.. వీటిని బీఎస్-4గా మార్చేశారు. అనంతరం వీటిలో నాలుగు బస్సులుగా మార్చారు. వీటికి నకిలీ ఇన్స్యూరెన్స్ క్రియేట్ చేశారు. నకిలి పర్మిట్లు సృష్టించారు. ఇలా అన్నీ నకిలీ.. నకిలీ.. నకిలీ.. మొత్తంగా కేవలం డబ్బు కోసమే అన్నట్టుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమాలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సంపూర్ణంగా వీరికి దోహదపడిందని కూడా తెలుసుకున్నారు. ఈ పరిణామాలనే కారణంగా జేసీ ప్రభాకర్, ఆయన కుమారుడు అరెస్టు అయ్యారనేది వాస్తవం.
అయితే, వాస్తవం ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయం చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. తాజా పరిణా మాలకు మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారీ అవకాశవాద రాజకీయం చేయడం కోసమే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విఫలమవుతోంది. ఇంతగా జగన్ ప్రభుత్వం జేసీ వ్యవహారానికి సంబంధించి గుట్టు విప్పేసినా కూడా చంద్రబాబు ఇంకా సమర్ధించడం అంటే.. చాలా ప్రమాదకర పరిణామంలోకి నెట్టేసుకుంటున్నటేనని అంటున్నారు పరిశీలకులు.