ఆడబిడ్డల రక్షణ బాధ్యత తాము తీసుకుంటామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. కన్నతల్లులను కూడా దూషించేలా పోస్టులు పెట్టారు. వీళ్లు అసలు మనుషులేనా..? NDA లో కూడా ఏ లీడర్ ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాలకు పదును పెడతాం. నిందితులను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని నిలబట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో గెలవడం ఓ చరిత్ర అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడి చేశారు. వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను నాశనం చేశారు. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపగా మారాయి. స్కామ్ ల కోసమే స్కీమ్ లు అమలు చేశారు. అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బ తీశారు.