రామ్మోహన్ బావ దూకుడు…వైసీపీకి చుక్కలే.. !

-

2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం టీడీపీ నుంచి భారీ మెజారిటీతో గెలిచి అందరికీ షాక్ ఇచ్చిన నాయకురాలు ఆదిరెడ్డి భవాని. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా, రామ్మోహన్ నాయుడు సోదరి అయిన భవాని రాజమండ్రి సిటీ నుంచి బరిలో దిగి, దాదాపు 30 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలిచారు. అయితే తొలిసారి గెలిచిన భవానికి రాజకీయాలపై పెద్ద పట్టు లేదు. దీంతో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ వెనుక ఉండి అన్నీ నడిపిస్తున్నారు.

పేరుకు భవాని ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ బాధ్యతలన్నీ శ్రీనివాస్ చూసుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మిగతా టీడీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగానే శ్రీనివాస్ దూకుడుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, వైసీపీ తప్పులని ఎత్తి చూపిస్తున్నారు.

టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇలా దూకుడుగా ఉన్న ఆదిరెడ్డి ఫ్యామిలీ టీడీపీని వీడుతుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలని ఖండించి టీడీపీని వీడే ప్రసక్తిలేదని శ్రీనివాస్ తేల్చి చెప్పేసి, కొన్ని వ్యతిరేక వర్గాలకు షాక్ ఇచ్చాడు. శ్రీనివాస్ ఇలా పనిచేయడంలో వల్ల నగరంలో అధికార వైసీపీ పుంజుకోవడం కష్టమైపోయింది.

ఎన్నికల్లో ఓడిపోయిన రౌతు సూర్య ప్రకాశ్ సైలెంట్ అవ్వడంతో, వైసీపీ అధిష్టానం శిఖాకొల్లు శివరామ సుబ్రహ్మణ్యంకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి ఫ్యామిలీని డామినేట్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. నగరం టీడీపీకి కంచుకోటగా ఉండటం, భవాని ప్లేస్‌లో శ్రీనివాస్ నియోజకవర్గంలో దూకుడుగా పనిచేయడం వల్ల వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా సిటీలో వైసీపీని పుంజుకోకుండా చేశారు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news