శశికళ రీఎంట్రీ పై బీజేపీ రాయబారం ఫలిస్తుందా ?

-

గతంలో సీఎం సీటు వరకు వచ్చినా, జైలు పాలై, పార్టీనుండి బహిష్కృతురాలయ్యారు శశికళ. ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యాక పార్టీని షేక్‌ చేస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్దమైన వేళ చిన్నమ్మ దారెటు అన్నది ఆసక్తి రేపుతుంది. అన్నాడీఎంకేలో రీ ఎంట్రీ కి బీజేపీ తలుపు తట్టిందా అన్న చర్చతో తమిళ రాజకీయాల పై ఆసక్తి పెంచుతుంది.

ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నాడీఎంకే, డీఎంకే కూటములు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరుణ, జయ లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు కావటంతో అందరిలో ఆసక్తిపెరుగుతోంది. అయితే, జయ మృతి తర్వాత అన్నీ డీఎంకె లో అనూహ్యపరిణామాలు ఏర్పడ్డాయి. శశికళ జైలునుంచి విడుదలైన తర్వాత ఇవి మరింత వేడెక్కాయి. పార్టీనుంచి బహిష్కృతమైన శశికళ, మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారట.

అన్నా డీఎంకేను అధికారంలో తీసుకురావటమే తన లక్ష్యమని చెబుతూ ఆ పార్టీలోకి బ్యాక్‌ డోర్‌ నుంచి ప్రవేశించేందుకు ప్లాన్‌ వేస్తున్నారట చిన్నమ్మ. దీనికోసం బిజెపి రాయబారాన్ని కోరుతోందట. కమలనాధుల రికమండేషన్‌ తో మళ్లీ పార్టీలో ప్రవేశించాలనేది శశికళ ప్లాన్‌ అనే చర్చ నడుస్తోంది. శశికళ తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని భావించే నేతలు అన్నా డీఎంకేలో ఉన్నారు. బీజేపీ కూడా ఇదే విషయాన్ని అన్నాడీఎంకే వద్ద ప్రస్తావించిందట. కానీ శశికళను పార్టీలోకి తీసుకోవడానికి పన్నీర్ సెల్వం ఒప్పుకున్నా ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం ససేమిరా అంటున్నారు.

శశికళ పార్టీలోకి అడుగుపెడితే, అంతర్గతంగా మళ్ళీ విభేదాలు తలెత్తుతాయని, పార్టీలో మళ్ళీ చీలికలు వస్తాయంటున్నారు. ఒకవేళ పార్టీలోకి శశికళను ఆహ్వానిస్తే ఆమెకు పగ్గాలు అప్పగించాల్సి వస్తుంది. పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా చిన్నమ్మ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పళనిస్వామి దీనికి అంగీకరించడం లేదనే టాక్‌ నడుస్తోంది. దీంతో చిన్నమ్మ దారేమిటనే చర్చ తమిళనాట నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news