కరోనా లాక్‌డౌన్ వల్ల పరిశ్రమలు, వ్యాపారాలు మూత పడడంతో పర్యావరణం ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిశుభ్రంగా మారింది. మానవుడు చేసిన తప్పిదాలకు ప్రకృతి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న అనేక నదులు ఇప్పుడు శుభ్రమైన నీటితో కనిపిస్తున్నాయి. ఇక నర్మదా నది కూడా ఈ జాబితాలో చేరింది. గత 20 సంవత్సరాల తరువాత ఇప్పుడే మళ్లీ ఆ నదికి కొత్త రూపం వచ్చింది. దీంతోపాటు ఆ నది నీళ్లు కూడా ఇప్పుడు చాలా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
మాండ్లా, జబల్‌పూర్‌ల మధ్య ఉన్న నర్మదా నది ప్రాంతాల్లో కాలుష్య తీవ్రతను సైంటిస్టులు మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షించారు. ఈ క్రమంలోనే కేవలం నెల రోజుల వ్యవధిలో ఆ నదిలో కాలుష్యం తీవ్రత గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం ఆ నీరు తాగేందుకు అనువుగా మారిందని సైంటిస్టులు వెల్లడించారు. కాలుష్యం స్థాయిలు మార్చి నెలలో 1.8 నుంచి 1.9 మధ్య ఉంటే ఇప్పుడు 0.7 నుంచి 1 వరకు ఉన్నాయని వారు వెల్లడించారు. ఈ క్రమంలోనే నది శుభ్రంగా కనిపిస్తుందని వారంటున్నారు.
కాగా మరోవైపు ఇప్పటికే అటు గంగానది కూడా చాలా శుభ్రంగా మారిన సంగతి తెలిసిందే. పలు చోట్ల నది లోపలి భాగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని.. ఇప్పటికే పలువురు ఆ ఫొటోలను షేర్ చేశారు. ఇక ఇప్పుడు నర్మదా నది కూడా అదే జాబితాలో చేరడం.. నిజంగా.. హర్షించదగిన విషయం..