ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం క్రమంగా పెరిగిపోతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి లభించడం లేదు. అయితే గాలి కాలుష్యం వల్ల ఇప్పటి వరకు ఊపిరితిత్తులకు చెందిన జబ్బులు వస్తాయని అనుకున్నారు. కానీ అవే కాదు.. ఆ కాలుష్యం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కూడా అవకావం ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు.
అమెరికాలోని హారింగ్‌టన్ యూనివర్సిటీ హాస్పిటల్స్ సైంటిస్టులు తాజాగా పరిశోధనలు చేశారు. వారు ల్యాబ్‌లో కాలుష్య భరితమైన వాతావరణాన్ని సృష్టించారు. ఈ క్రమంలో 3 గ్రూపులుగా కొందరిని విభజించి వారిపై ప్రయోగాలు చేశారు. స్వచ్ఛమైన గాలిని పీల్చే ఒక గ్రూపుతోపాటు కాలుష్య భరితమైన గాలి పీల్చే మరొక గ్రూపును, కొవ్వు పదార్థాలుగా ఎక్కువగా తీసుకునేలా మరో గ్రూపును వారు విభజించి ప్రయోగాలు చేపట్టారు.
ఆ ప్రయోగాలను వారు 24 వారాల పాటు చేపట్టారు. దీంతో వారు గుర్తించిందేమిటంటే.. స్వచ్ఛమైన గాలిని పీల్చిన గ్రూపును పక్కన పెడితే మిగిలిన రెండు గ్రూపులు.. అంటే.. కాలుష్యభరితమైన గాలిని పీల్చుకున్నవారు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తిన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందని, అలాగే వారి మెటబాలిజం కూడా సరిగ్గా లేదని తేల్చారు. ఈ రెండు లక్షణాలను టైప్ 2 డయాబెటిస్ కు ఆరంభంగా చెప్పవచ్చు. అది అలాగే కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ వస్తుందని అంటున్నారు.
కనుక కాలుష్య భరితమైన వాతావరణంలో ఉండేవారితోపాటు నిత్యం కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. అలాగే వారు గుండె జబ్బుల బారిన పడే చాన్స్ ఉందని సైంటిస్టులు అంటున్నారు. కనుక ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యం పోషకాహారాలను తీసుకోవడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చాలని అంటున్నారు.