జియో దూకుడు.. భారీగా స‌బ్‌స్క్రైబర్ల‌ను కోల్పోయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా..!

-

టెలికాం సంస్థ జియో దూకుడుకు ఇత‌ర సంస్థ‌లు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. ఓవైపు ఇత‌ర సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతుంటే.. జియో మాత్రం త‌న స‌బ్‌స్క్రైబర్ల సంఖ్య‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటోంది. ఇక తాజాగా జియోలో కొత్త‌గా 36 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబర్లు వ‌చ్చి చేర‌గా.. ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియాలు చెరో 47 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. మే నెల కాలానికి గాను ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

airtel and vodafone idea lost heavy amount of mobile subscribers

ఇక ప్ర‌స్తుతం జియో మొత్తం 39.2 కోట్ల మంది క‌స్ట‌మర్ల‌‌తో దేశంలోనే అత్య‌ధిక స‌బ్‌స్క్రైబర్లను క‌లిగి ఉన్న టెలికాం కంపెనీగా కొన‌సాగుతోంది. మ‌రోవైపు ఎయిర్‌టెల్‌కు 31.7 కోట్ల మంది స‌బ్‌స్క్రైబర్లు ఉండ‌గా, వొడాఫోన్ ఐడియాకు 30.9 కోట్ల మంది ఉన్నారు. అలాగే ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు 11.9 కోట్ల మంది స‌బ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఆశ్చ‌ర్యంగా బీఎస్ఎన్ఎల్‌లో కొత్త‌గా 2 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబర్లు చేర‌డం విశేషం.

ఇక ఏప్రిల్ నెల‌లో దేశ‌వ్యాప్తంగా మొత్తం 116.94 కోట్ల మంది టెలికాం స‌బ్‌స్క్రైబర్లు ఉండ‌గా, మే నెల వ‌ర‌కు ఆ సంఖ్య 116.36 కోట్ల‌కు త‌గ్గింది. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా ల్యాండ్‌లైన్ క‌నెక్ష‌న్ల‌ను వాడుతున్న వారి సంఖ్య 1.5 ల‌క్ష‌లు త‌గ్గి 1.97 కోట్ల‌కు చేరుకుంది. కానీ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ల‌ను వాడే వారి సంఖ్య పెరిగింది. కొత్త‌గా 1.93 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ల‌ను తీసుకోగా వారి సంఖ్య మొత్తం 66.37 కోట్ల‌కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news