మీరు ఎయిర్‌టెల్ వాడుతున్నారా..? అయితే మీకు బిగ్ షాక్. టెలికం కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. మార్కెట్లో మిగతా పోటీ సంస్థల ప్లాన్లకు అనుగుణంగా ప్రీపెయిడ్ రీచార్జ్‌ల్లో మార్పులు చేసింది. రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ కాలపరిమితిని భారీగా తగ్గించింది. ఏకంగా 26 రోజులు తగ్గించి భారీ షాక్ ఇచ్చింది. అంటే.. రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని 82 రోజుల నుంచి 56 రోజులకు తగ్గించింది.
పాపులర్ రీఛార్జ్ ప్లాన్ రూ.558లో భాగంగా ఇప్పటి వరకు వినియోగదారులు 82 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటాతో పాటు 100 ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు పొందుతున్నారు. సవరించిన ప్లాన్ ప్రకారం ప్లాన్‌లో ఉన్న ఆఫర్లన్నీ ఇకపై కేవలం 56 రోజుల వరకే వర్తించనుంది. అయితే రూ.558ప్లాన్‌లో ఫొటోగ్రఫీ నుంచి మ్యూజిక్ వరకు ఏదైనా ఇష్టమైన కోర్సును ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. షా అకాడమీ ద్వారా నాలుగు వారాలపాటు ఈ కోర్సు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
అలాగే, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. జీ5, హూక్, 370కిపైగా లైవ్ టీవీ చానళ్లు, 10 వేలకు పైగా సినిమాలు వీక్షించవచ్చు. దీంతోపాటు ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ప్యాక్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.