టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్లాటినం మొబైల్ కస్టమర్లకు ప్రియారిటీ 4జీ నెట్‌వర్క్ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. అంటే.. ప్లాటినం విభాగానికి చెందిన ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు ఇతర కస్టమర్ల కన్నా వేగవంతమైన 4జి ఇంటర్నెట్, కనెక్టివిటీ సేవలను పొందవచ్చు. అలాగే కస్టమర్ సర్వీస్ సేవల విషయంలోనూ ప్లాటినం కస్టమర్లకే ముందుగా ప్రాధాన్యతను ఇస్తారు.
ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రూ.499 అంతకన్నా ఎక్కువ విలువ గల ప్లాన్లను వాడుతున్న కస్టమర్లను ప్లాటినం కస్టమర్లుగా గుర్తించింది. దీంతో వారికి ప్రియారిటీ 4జీ నెట్‌వర్క్ సేవలు ఆటోమేటిగ్గా లభిస్తాయి. వీరు ఇతర కస్టమర్ల కన్నా ఎక్కువ రెట్ల వేగంతో 4జీ ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. అలాగే ప్లాటినం కస్టమర్లకు డెడికేటెడ్ కస్టమర్ కేర్ సేవలు లభిస్తాయి. ఎయిర్‌టెల్ స్టోర్లకు వెళ్లినా ముందుగా ప్లాటినం కస్టమర్లకే ప్రాధాన్యతను ఇస్తారు. దీంతో వారు ఇతర కస్టమర్ల కన్నా ముందుగానే తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది.
ఇక ప్లాటినం కస్టమర్లు సిమ్ డ్యామేజ్ అయినా, కోల్పోయినా, సిమ్‌ను మార్చదలిచినా.. ప్రియారిటీ 4జి సిమ్ సర్వీస్ ద్వారా ఆ సిమ్‌లను ఉచితంగా ఇంటి వద్దే డెలివరీ పొందవచ్చు. ఇతర కస్టమర్లు పైన తెలిపిన విధంగా రూ.499 లేదా అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకుంటే వారు కూడా ప్లాటినం కస్టమర్లు అవుతారని ఎయిర్‌టెల్ తెలిపింది. అయితే వొడాఫోన్ ఇప్పటికే రెడ్ఎక్స్ ప్లాన్లను తీసుకునే వారికి కూడా సరిగ్గా ఇలాంటి ప్రియారిటీ సేవలనే అందిస్తోంది. రెడ్ఎక్స్ ప్లాన్లను వాడే వొడాఫోన్ కస్టమర్లు ఇతర వొడాఫోన్ కస్టమర్ల కన్నా 50 రెట్లు ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. ఇక రూ.499 లేదా అంతకన్నా ఎక్కువ విలువ గల ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడుతున్న కస్టమర్లు ఎయిర్‌టెల్ యాప్‌లోకి వెళ్లి తాము ప్లాటినం విభాగంలో ఉన్నామో, లేదోనని ఒకసారి చెక్ చేసుకోవచ్చు.