అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును బుధవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్ట్. ఈరోజు తీర్పు ఇస్తారని అనుకున్నా రేపటికి తీర్పు వాయిదా వేసింది. 2013లో నిర్మల్ లో హిందువులకు వ్యతిరేఖంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై 9 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ జరిగింది. నిజామాబాద్, నిర్మల్ లో చేసిన వ్యాఖ్యలపై రెండు కేసులు నమోదు అయ్యాయి. సీఐడీ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత ఈ వ్యాఖ్యలు చేయలేదని అక్బరుద్దీన్ అన్నప్పటికీ, సెంట్రల్ ఫోరెన్సిక్ లాబోరేటరీ, చంఢీగడ్ ఈ వాయిస్ అక్బరుద్దీన్ దే అని తేల్చింది. దాదాపుగా 30మంది సాక్షులను విచారించారు. ఐపీసీ సెక్షన్ 153-A ( మతాల మధ్య శత్వుత్వం పెంచడం) , 295-A ( ఇతర మతాలను అవమానించడం, విశ్వాసాలను దెబ్బతీయడం) కింద అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యాయి.
కాగా.. ఈరోజు తీర్పు వస్తుందని భావించి పాతబస్తీలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. నాంపల్లి కోర్ట్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నాలుగు ప్లాటూన్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు 500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.