ఉత్త‌మ పురుష : అనంత దారుల్లో ప‌వ‌న్

-

వైసీపీ స‌ర్కారు ఎప్ప‌టి నుంచో చెబుతున్న విధంగా రైతుల‌ను ఆదుకోవాల‌ని, కేవ‌లం మాట‌లు కాదని, ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం కావొద్ద‌ని జ‌న‌సేన హిత‌వు చెబుతోంది. కేవ‌లం ఆర్థిక కేటాయింపులు చేసి త‌రువాత నిధుల విడుద‌ల విష‌య‌మై ప‌ట్టించుకోని వైనంపై కూడా నిల‌దీస్తోంది. ఓట్లు సీట్లు అని కాకుండా కేవ‌లం మాన‌వ‌తే ధ్యేయంగా ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తే ప‌ట్టెడ‌న్నం పెట్టే రైతుకు స‌కాలంలో స‌త్వ‌ర న్యాయం ద‌క్కుతుంద‌ని అంటున్నారు జ‌న‌సేనాని. అనంత దారుల్లో తాజాగా రైతు భ‌రోసా యాత్ర ప్రారంభం అయింది. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో…

సాగు అనుకూలించ‌క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారికి ప్ర‌భుత్వం ఇస్తున్న సాయం ఏ పాటికీ స‌రిపోవ‌డం లేదు. అది కూడా  కొంద‌రికే! కొన్నిసార్లు స‌ర్కారు చుట్టూ తిగిగినా కూడా స్పంద‌నే లేదు. దేశానికి అన్నం పెట్టే రైత‌న్న ప్రాణాలు విడిస్తే క‌నీసం మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం  కూడా జారీ చేసేందుకు డ‌బ్బులు గుంజుకుంటున్న అధికారులు ఎంద‌రో? ఈ త‌రుణంలో రైతు రుణ‌మాఫీ ప‌థ‌కం ఏ మాత్రం ఆదుకోవ‌డం లేదు. విత్తన రాయితీ లేనే లేదు. స‌కాలంలో నాణ్య‌మ‌యిన ఎరువుల స‌ర‌ఫ‌రా ఊసే లేదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు ఎప్పుడో తిలోద‌కాలు ఇచ్చేశారు. అయినా కూడా రైతంటే మాకు ప్రేమ అని ప్ర‌క‌టించే నాయ‌కులు త‌మ సొంత డ‌బ్బుల‌తో ఏనాడయినా ఆదుకున్నారా? క‌నీసం వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ద‌క్కాల్సిన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు అయినా ద‌క్కించారా? ఈ త‌రుణంలో ప‌వ‌న్ స్పందించి, ఇవాళ్టి నుంచి రైతు భ‌రోసా యాత్ర‌కు సంక‌ల్పించ‌డం ఓ శుభ ప‌రిణామం.

అన్న‌దాత క‌ష్టాల‌ను తెలిసిన వ్య‌క్తిగా నేనున్నా అంటూ జ‌న‌సేన అధ్య‌క్షులు స్పందిస్తున్న తీరు  మ‌రో నాయ‌కుడికి స్ఫూర్తి కావాలి. కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాలే ప్ర‌థ‌మావ‌ధిగా చేసుకుంటూ, నాలుగు ప‌ద‌వులను సొంతం చేసుకోవ‌డ‌మే ప్ర‌థ‌మ ధ్యేయంగా ఉంటూ ప‌బ్బం గడుపుకునే వారికి నిజంగానే ప‌వ‌న్ ఓ ఆద‌ర్శవాది. ఇప్ప‌టిదాకా ఎన్నో సంద‌ర్భాల్లో బాధిత కుటుంబాల‌కు త‌న వంతు సాయం చేసినా కూడా అవేవీ బ‌య‌ట‌కు చెప్పుకోలేదు. ఆంధ్రా, తెలంగాణ అన్న తేడా లేకుండా ఎన్నో కుటుంబాల‌ను త‌న వంతుగా చేరదీసినా, చేరువ చేసినా ఆయ‌న వాటిని వెల్ల‌డించ‌లేదు. ఓట్లు రాక‌పోయినా ప‌ర్లేదు, ప‌దవులు ద‌క్క‌క‌పోయినా ప‌ర్లేదు ప్ర‌జ‌ల కోసం నిస్వార్థంగా ప‌నిచేయ‌డ‌మే ప్ర‌ధాన క‌ర్త‌వ్యం కావాల‌ని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు  మ‌రింత వేగంతో పనిచేస్తున్నారు.

ఇవాళ రైతు భ‌రోసా యాత్ర‌ను ప్రారంభించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందుకు అనంత‌పురం జిల్లాను ఎంచుకున్నారు. ఇప్ప‌టికే యాత్ర ప్రారంభం అయింది. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించి పార్టీ త‌ర‌ఫున ల‌క్ష రూపాయ‌లు సాయం అందించ‌నున్నారు. ఇందులోభాగంగా అనంత‌పురం చేరుకుని, కొత్త చెరువు గ్రామానికి చెందిన సాకే రామకృష్ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఇదే విధంగా బాధిత కుటుంబాల‌ను క‌లిసి వారి గోడు విన‌నున్నారు. బాధిత కుటుంబాల‌కు సాయం చేసేందుకు ఇప్ప‌టికే త‌న వంతుగా ఐదు కోట్ల రూపాయ‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించి మానవ‌త‌ను చాటుకున్నారు. ఇందుకు సంబంధించి త‌న అకౌంట్ నుంచి నిధుల‌ను కూడా విడుద‌ల చేసి పార్టీకి అందించి స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news